మనుషుల్ని వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం: మోపిదేవి

28-09-2020 Mon 18:20
Mopidevi Venkataramana slams TDP Chief Chandrababu on BC issue
  • చంద్రబాబుకు ఇప్పుడు బీసీలు గుర్తుకు వస్తున్నారని వ్యాఖ్యలు
  • వారిని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నారని విమర్శలు
  • అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదన్న మోపిదేవి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మనుషుల్ని వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం అని అన్నారు. బీసీలను ఎప్పుడూ చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని, అధికారంలో లేకపోయేసరికి చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు.

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు బీసీలకు అమలు చేయలేదని, బీసీలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్యానించారు. బీసీ వర్గానికి చెందిన జస్టిస్ ఈశ్వరయ్యకు చంద్రబాబు అన్యాయం చేశారని వెల్లడించారు.

రాష్ట్రంలో బీసీల సామాజిక అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని, 57 బీసీ కార్పొరేషన్లను సీఎం జగన్ ఏర్పాటు చేశారని మోపిదేవి వెల్లడించారు. 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే సీఎం జగన్ రెండు సీట్లను బీసీలకే ఇచ్చారని వివరించారు. రాజకీయంగా అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 5 డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం ద్వారా వారిని పరిపాలనలో భాగస్వామ్యం చేశారంటూ సీఎం జగన్ ను కొనియాడారు. ఏడాది కాలంలో రెండు కోట్ల మంది బీసీలు లబ్దిపొందేలా రూ.19,750 కోట్ల ఆర్థికపరమైన చేయూతను సీఎం జగన్ అందించారని తెలిపారు.