ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు 'భారతరత్న' ప్రకటించండి... ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

28-09-2020 Mon 17:27
CM Jagan asks Prime Minister Modi confer SP Balasubrahmaniam
  • బాలుకు తగిన నివాళి ఇదేనన్న సీఎం జగన్
  • అసాధారణ ప్రతిభావంతుడు అంటూ కొనియాడిన వైనం
  • మా రాష్ట్రంలో పుట్టడం అదృష్టం అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు

మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. గాన దిగ్గజం బాలసుబ్రహ్మణ్యంకు అత్యున్నత పురస్కారం ప్రకటించడం ద్వారా తగిన నివాళి అర్పించాలని కోరారు.

"ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి గానగంధర్వుడు మా రాష్ట్రంలోని నెల్లూరులో జన్మించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సెప్టెంబరు 25 శుక్రవారం ఆయన పరమపదించారు. ఆయన అకాల నిష్క్రమణం అభిమానులను, ప్రముఖులను కలతకు గురిచేయడమే కాదు, అంతర్జాతీయ సంగీత రంగాన్ని కూడా ప్రభావితం చేసింది. గత 50 ఏళ్లుగా ఆయన ప్రపంచ సంగీత పరిశ్రమపై చూపిన ప్రభావం, ఆయన అందుకున్న ప్రజాదరణ అపారం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల నుంచి ధారాపాతంగా జాలువారుతున్న సుసంపన్నమైన నీరాజనాలే ఆయన ఘనతకు కొలమానాలు.

ఆయన ఘనతలు సంగీతాన్ని మించినవి. అసమాన ప్రతిభతో స్వరాల కూర్పును ఆయన ఉత్కృష్టస్థాయికి తీసుకెళ్లారు. ఆయన తన మాతృభాష తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా 6 జాతీయ అవార్డులు, 25 నంది అవార్డులు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అనేక పురస్కారాలతో ఆయనను గౌరవించాయి.

అంతేకాదు, ఆరుసార్లు దక్షిణభారత ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డులు కూడా పొందారు. 2016లో ఆయనను 'ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్' గా గుర్తించి 'సిల్వర్ పీకాక్ మెడల్' బహూకరించారు. ఆయన సంగీత సేవలకు ప్రతిగా భారత కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.

గతంలో కేంద్ర ప్రభుత్వం లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీమ్ సేన్ జోషి వంటి సంగీత దిగ్గజాలకు భారతరత్న ప్రకటించింది. సంగీతం, కళా రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపుతూ, విశేష సేవలందించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా భారతరత్న ప్రకటించి ఆయనకు నివాళి అర్పించాలి. ఎప్పటికీ గుర్తుండిపోయేలా 5 దశాబ్దాల పాటు ఆయన అందించిన సంగీత సేవలకు ఇదే అత్యున్నత గుర్తింపు అవుతుంది" అంటూ సీఎం జగన్ తన లేఖలో వివరించారు.