టీడీపీకి రాజీనామా అంటూ ప్రచారం.. ఖండించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి!

28-09-2020 Mon 17:23
Gorantla Butchaiah Chowdary condems news regarding his  resignation to TDP
  • ఇక  మిగిలింది మోదీనే అనుకుంటా
  • వైసీపీలో వస్తున్నట్టు ఆయన మీద కూడా వేసేయండి
  • మీ పర్ఫామెన్స్ కు 5 రూపాయలే వస్తాయి

తెలుగుదేశం పార్టీ తరపున తన గొంతుకను బలంగా వినిపిస్తూ, అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందు వరుసలో ఉంటారు. అసెంబ్లీలో అయినా, అసెంబ్లీ వెలుపల అయినా శక్తివంచన లేకుండా తమ పార్టీ కోసం పోరాటం చేస్తుంటారు. అయితే, టీడీపీకి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి రాజీనామా చేశారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు.

అందరూ అయిపోయారు.. ఇక మిగిలింది ప్రధాని మోదీ మాత్రమే అనుకుంటా అని బుచ్చయ్య చౌదరి సెటైర్ వేశారు. 'ఇంకెందుకు లేటు. వైసీపీలోకి వస్తున్నారంటూ ఆయన మీద కూడా వేసేయండి మీరు ఎంత పర్ఫామెన్స్ ఇచ్చినా మీకు 5 రూపాయలు మాత్రమే వస్తాయి' అని ట్వీట్ చేశారు. తనపై వచ్చిన వార్త ఫేక్ అని కొట్టిపారేశారు.