జడ్జి సోదరుడు రామచంద్రపై దాడి ఘటనలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు

28-09-2020 Mon 15:42
TDP appointed fact finding committee in Judge Ramakrishna family members issue
  • చిత్తూరు జిల్లాలో జడ్జి సోదరుడిపై దాడి
  • దాడికి పాల్పడింది వైసీపీ వాళ్లేనంటున్న టీడీపీ
  • జడ్జి సోదరుడ్ని పరామర్శించిన టీడీపీ నేతలు

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై కొందరు దుండగులు దాడి చేయడం తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది వైసీపీ వాళ్లేనంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు, ఈ ఘటనలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. మదనపల్లెలో చికిత్స పొందుతున్న రామచంద్రను ఈ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరామర్శించారు.

ఈ సందర్భంగా పార్టీ అగ్రనేత కళా వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఉద్దేశపూరిత దాడులకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 16 నెలల కాలంలో 152కి పైగా దాడులు జరిగాయని అన్నారు. జడ్జి కుటుంబ సభ్యులనే వేధిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కళా వెంకట్రావు ప్రశ్నించారు.