సహజీవనం చేస్తున్న మహిళపై కాల్పులు జరిపి.. రోడ్డుపై పడేసి వెళ్లిన వ్యక్తి!

28-09-2020 Mon 13:20
  • ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటన
  • భార్యను వదిలేసి, మరో మహిళతో సహజీవనం 
  • కారులో వెళ్తూ గొడవపడ్డ వైనం
  • ప్రాణాలతో బయటపడ్డ మహిళ
man shoots woman

ఓ మహిళపై ఓ వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపి, ఆమెను రోడ్డుపై పడేసి వెళ్లిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. లాహోరీ గేట్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న సందీప్‌ దహియా అనే వ్యక్తి తన భార్యతో విభేదాల కారణంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆయన మరో మహిళతో సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నాడు.

ఇద్దరూ కలిసి అలీపూర్‌లో నిన్న కారులో ప్రయాణిస్తుండగా గొడవపడ్డారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సందీప్‌ ఆమెపై గన్‌తో కాల్పులు జరిపాడు. అనంతరం ఆమెను రోడ్డు మీద పడేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన సబ్ ఇన్స్పెక్టర్ జైవీర్‌ ఓ ప్రైవేట్‌ వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశాడు.

ప్రస్తుతం బాధిత మహిళకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.  ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. జైవీర్‌ వెంటనే స్పందించి, ఆసుపత్రికి తీసుకురావడం వల్లే ఆమె బతికిందని వైద్యులు తెలిపారు. తాను సహజీవనం చేస్తోన్న సందీప్‌ దహియా తనపై కాల్పులు జరిపినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.