Jagan: చిన్న, సన్నకారు రైతులకు బోర్లతో పాటు మోటార్లు కూడా ఉచితంగా బిగిస్తాం: సీఎం జగన్

  • వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభించిన సీఎం జగన్
  • క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, రైతులనుద్దేశించి ప్రసంగం
  • రైతులందరికీ ఉచితంగా బోర్లు
  • మొదటి బోరు విఫలమైతే రెండో బోరు వేయాలని ఆదేశం
CM Jagan launches YSR Jalakala in AP

రాష్ట్రంలో వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్లు, రైతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని తెలిపారు. మొదటి బోరు విఫలమైతే రెండోసారి బోరు వేయాలని అధికారులకు స్పష్టం చేశామని చెప్పారు.

బోరు వేసేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, ఉచిత బోరు కోసం రైతులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. లేకపోతే, రైతులు తమ ప్రాంతంలోని వలంటీర్ సాయంతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు బోర్లతో పాటు మోటార్లు కూడా ఉచితంగానే బిగిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఇది మేనిఫెస్టోలో చెప్పకపోయినా, రైతుల కోసం చేస్తున్నామని స్పష్టం చేశారు.

144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ ప్రాంతాల్లో వైఎస్సార్ జలకళ పథకం అమలు చేస్తామని, ప్రతి నియోజకవర్గానికి ఒక బోరు వేసే యంత్రాన్ని అందుబాటులో ఉంచుతామని వివరించారు.

More Telugu News