Mayank Agarwal: రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై శివాలెత్తిన మయాంక్ అగర్వాల్... శతకబాదుడు!

  • ఐపీఎల్ లో రాజస్థాన్ వర్సెస్ పంజాబ్
  • టాస్ గెలిచి పంజాబ్ కు బ్యాటింగ్ అప్పగించిన రాజస్థాన్
  • సిక్సర్ల మోత మోగిస్తున్న మయాంక్
  • 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగులు చేసిన కింగ్స్
Mayank Agarwal blasts Royal bowling

ఇవాళ్టి ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టుకు ఏదీ కలిసిరాలేదు. పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ విధ్వంసకర బ్యాటింగ్ తో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా మయాంక్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీతో కదం తొక్కాడు. మొత్తం 50 బంతులాడిన ఈ కర్ణాటక బ్యాట్స్ మన్ 106 పరుగులు చేసి టామ్ కరన్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

మయాంక్ స్కోరులో 10 ఫోర్లు 7 భారీ సిక్సలున్నాయి. సాధారణంగా డైనమైట్ లా చెలరేగిపోయే కేఎల్ రాహుల్ కూడా మయాంక్ ధాటికి ఇవతలి ఎండ్ లో ప్రేక్షకుడిలా మిగిలిపోయాడు. మయాంక్ ఏ ఒక్క రాజస్థాన్ బౌలర్ నూ వదల్లేదు. మైదానం చిన్నది కావడంతో పాటు పిచ్ కూడా బ్యాటింగ్ కు సహకరించడంతో మయాంక్ కు ఎదరులేకుండా పోయింది. సెంచరీ చేయడానికి కేవలం 45 బంతులే అవసరమయ్యాయంటే అతడి దూకుడు ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక, కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 69 పరుగులు చేసి అంకిత్ రాజ్ పుత్ కు వికెట్ అప్పగించాడు. చివర్లో మ్యాక్స్ వెల్ (13), నికోలాస్ పూరన్ (8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 25 రన్స్) ధాటిగా ఆడడంతో స్కోరు 200 దాటింది.

More Telugu News