నోటితో దళిత జపం చేస్తూ నొసటితో వెక్కిరిస్తున్నారు: చంద్రబాబుపై సజ్జల విమర్శలు

27-09-2020 Sun 21:43
  • అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఏంచేశారన్న సజ్జల
  • ఇప్పుడు జగన్ సర్కారుకు అడ్డుపడుతున్నారంటూ వ్యాఖ్యలు
  • దళితులకు తీరని ద్రోహం చేస్తున్నారంటూ ట్వీట్
Sajjala Ramakrishna Reddy once again slams Chandrababu

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మేలు చేసే అవకాశం ఉన్నా, వాళ్ల కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఈ వర్గాల అభ్యున్నతికి చారిత్రక నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు ముందుకేస్తుంటే, కోర్టుల ద్వారా అడ్డుకోవడం న్యాయమేనా చంద్రబాబు గారూ? అంటూ ప్రశ్నించారు.

"పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వాటిని అడ్డుకోలేదా? దీనివల్ల నష్టపోతున్నది దళితులు కాదా?" అంటూ సజ్జల నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువు వల్ల దళితులు, పేదల పిల్లలు బాగుపడరా? దీనికి మోకాలొడ్డింది మీరు కాదా? అంటూ ట్వీట్ చేశారు.

"రాష్ట్ర ఎన్నికల కమిషర్ గా దళితుడైన రిటైర్డ్ హైకోర్డు జడ్జిని నియమిస్తే, మీ అనుయాయుడైన నిమ్మగడ్డ రమేశ్ కోసం కోర్టుల ద్వారా ఆయనను అడ్డుకోలేదా? మీరు నోటితో దళిత జపం చేస్తూ నొసటితో వెక్కిరిస్తున్నారు. మీ చేష్టలతో దళితులకు తీరని ద్రోహం చేస్తున్నారు" అంటూ విమర్శించారు.