అన్నాడీఎంకే కేంద్ర వ్యవసాయ బిల్లుకు మద్దతు పలకడం రైతులకు నమ్మకద్రోహం చేయడమే: కమలహాసన్

Kamal Haasan furious on AIADMK over agriculture bills
  • నూతన వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చిన కేంద్రం
  • మద్దతు పలికిన అన్నాడీఎంకే
  • రాష్ట్రాలపై దాడిగా అభివర్ణించిన కమల్
కేంద్రం ఇటీవల నూతన వ్యవసాయ చట్టం బిల్లుతో పాటు, పలు అనుబంధ బిల్లులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవసాయ బిల్లులు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర విభేదాలకు కారణమయ్యాయి. కేంద్రం వైఖరికి నిరసనగా ఎన్డీయే నుంచి కొన్ని పార్టీలు వైదొలగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ నాయకుడు కమలహాసన్ తమిళనాడు అధికారపక్షం అన్నాడీఎంకేపై విరుచుకుపడ్డారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు మద్దతు పలకడం ద్వారా అన్నాడీఎంకే రైతులకు నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు.

ఈ బిల్లులను రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై దాడిగా అభివర్ణించారు. కొరత, ధరల అంశంలో ఓ రాష్ట్రం ఏమీ చేయలేని దారుణమైన పరిస్థితి ఈ బిల్లుల కారణంగా ఏర్పడుతుందని కమల్ విమర్శించారు. ఈ బిల్లులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించకుండా తిప్పి పంపాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు మేలు చేసేందుకు మిగిలిన ఏకైక మార్గం అదొక్కటేనని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Kamal Haasan
AIADMK
Farmers
Agri Bills
Tamilnadu

More Telugu News