Farukh Engineer: మనవాళ్లకు హాస్య చతురత కాస్త తక్కువే!: గవాస్కర్ కు మద్దతు పలికిన అలనాటి కీపింగ్ దిగ్గజం

Wicket keeping legend Farukh Engineer supports Sunil Gavaskar
  • ఐపీఎల్ సందర్భంగా అనుష్కపై వ్యాఖ్యలు చేసిన గవాస్కర్
  • గవాస్కర్ పై అనుష్క ఆగ్రహం
  • గవాస్కర్ వ్యాఖ్యల్లోని హాస్యాన్ని అర్థం చేసుకోలేదన్న ఇంజినీర్
ఇటీవల ఐపీఎల్ క్రికెట్ కామెంట్రీ చెబుతూ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గురించి ప్రస్తావించిన సునీల్ గవాస్కర్ కు ఆ సెగ బాగానే తగిలింది. గవాస్కర్ పై అనుష్క శర్మ ఇంతెత్తున ఎగిరిపడింది. దీనిపై గవాస్కర్ వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గవాస్కర్ కు అలనాటి వికెట్ కీపర్ దిగ్గజం ఫారూక్ ఇంజినీర్ మద్దతు పలికారు. మనవాళ్లకు సెన్సాఫ్ హ్యూమర్ (హాస్య చతురత) కాస్త తక్కువేనని, గవాస్కర్ కామెంట్లలోని హాస్యాన్ని సరిగా అర్థం చేసుకోనందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.

"విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలపై సునీల్ గవాస్కర్ కామెంట్లు చేసి ఉండొచ్చు గాక, అయితే అది సరదాగానే అయ్యుంటుంది తప్ప ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండవనుకుంటున్నా. నాకు సునీల్ గవాస్కర్ గురించి బాగా తెలుసు. అతడు తప్పకుండా జోక్ గా మాట్లాడి ఉంటాడు" అంటూ ఫారూక్ ఇంజినీర్ స్పందించారు.

ఫారూక్ ప్రత్యేకంగా ఈ వ్యవహారంలో స్పందించడానికి బలమైన కారణమే ఉంది. గతంలో ఆయన కూడా అనుష్కపై వ్యాఖ్యలు చేసి ఆమె ఆగ్రహానికి గురయ్యారు. ఇంగ్లాండ్ లో జరిగిన గత వరల్డ్ కప్ లో టీమిండియా సెలెక్టర్లలో ఒకరు అనుష్కకు టీ కప్పు అందించడంపై ఫారూక్ ఇంజినీర్ వ్యాఖ్యలు చేశారు. దాంతో అనుష్క ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడింది. చివరికి ఆయన క్షమాపణలు కూడా చెప్పుకున్నారు.
Farukh Engineer
Sunil Gavaskar
Anushka Sharma
Virat Kohli
IPL 2020

More Telugu News