Hemant: వారిద్దరి తల్లులకు ముందే పరిచయం... హేమంత్ కేసులో మరో ఆసక్తికర విషయం వెల్లడి

Another interesting fact revealed by Police investigation in Hemant murder case
  • హేమంత్, అవంతిల ప్రేమకు ముందే వారి తల్లుల మధ్య స్నేహం
  • ఆ స్నేహం కారణంగా హేమంత్, అవంతిల పరిచయం
  • సందీప్ రెడ్డి, ఆశిష్ రెడ్డిలపై ఆరోపణలు చేస్తున్న అవంతి
హైదరాబాదులో జరిగిన పరువు హత్యలో హేమంత్ అనే యువకుడు బలైన సంగతి తెలిసిందే. హేమంత్, అవంతి ప్రేమ వివాహం చేసుకోగా, కక్షగట్టిన అవంతి కుటుంబ సభ్యులు హేమంత్ ను దారుణంగా హతమార్చారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. హేమంత్, అవంతిలకు పరిచయం ఏర్పడకముందే వారిద్దరి తల్లులు క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది.

హేమంత్ తల్లి రాణి, అవంతి తల్లి అర్చన ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అవంతి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా హేమంత్ తల్లి రాణి బ్యూటీషియన్ గా వెళ్లేంది. ఈ క్రమంలో హేమంత్ తల్లితో అవంతి దగ్గరైంది. ఆపై హేమంత్ తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. హేమంత్, అవంతిలు ప్రేమ వివాహం చేసుకోకముందు, ఇరువురి కుటుంబ సభ్యులు ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు వెళ్లేవారు. అయితే అవంతి, హేమంత్ ల ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేపింది.

హేమంత్, అవంతిని తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని అవంతి కుటుంబసభ్యులు భరించలేకపోయారు. ఈ కారణంగానే హేమంత్ ను చంపేశారని పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు 14 మందిని రిమాండ్ లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ సందీప్ రెడ్డి, ఆశిష్ రెడ్డి అనే మరో ఇద్దరు ఈ హత్యలో కీలక నిందితులని, హత్యకు పథకం వేసిందే వారిద్దరూ అని అవంతి ఆరోపిస్తోంది.

వారిద్దరినీ కూడా అరెస్ట్ చేయాలని హేమంత్ కుటుంబ సభ్యులు రేపు పోలీసులను కలిసి మరోసారి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి, ఆశిష్ రెడ్డి ఇద్దరూ పరారీలో ఉండడంతో వారిపై ఆరోపణలకు బలం చేకూరుతోంది.
Hemant
Avanti
Murder
Mothers
Hyderabad
Police

More Telugu News