మీడియా కథనాలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్

27-09-2020 Sun 16:30
  • డ్రగ్స్ కేసులో రకుల్ పేరు
  • ముంబయిలో రకుల్ ను విచారించిన ఎన్సీబీ అధికారులు
  • తనపై కథనాలను అడ్డుకోవాలంటూ కోర్టును కోరిన రకుల్
Rakul Preet approaches Delhi High Court on media articles
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక డ్రగ్స్ కోణం ఉందన్న కారణంగా నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపిక పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లను ఎన్సీబీ అధికారులు విచారించారు. అయితే తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలుపుదల చేయించాలంటూ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.

తనకు వ్యతిరేకంగా పత్రికల్లోనూ, టీవీ చానళ్లలోనూ జరుగుతున్న ప్రచారాన్ని ఆపు చేయిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రకుల్ ప్రీత్ న్యాయస్థానాన్ని కోరారు. సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులో ఉన్న తాను మీడియాలో వస్తున్న కథనాలను చూసి దిగ్భ్రాంతి చెందానని వివరించారు. ఈ పిటిషన్ ను న్యాయస్థానం మరో వారంలో విచారణకు తీసుకురానుంది.