రైతును రాజును చేయడంలో సీఎం కేసీఆర్ ముందు ఎవరైనా దిగదుడుపే: ఎర్రబెల్లి

27-09-2020 Sun 15:40
Minister Errabelli Dayakar Rao lauded CM KCR
  • కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎర్రబెల్లి
  • సీఎం కేసీఆర్ ను పేదింటి పెద్దన్నయ్యగా పేర్కొన్న వైనం
  • కేంద్రంపై విమర్శలు

వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాల ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.  రైతును రాజును చేయడంలోనూ, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడంలోనూ సీఎం కేసీఆర్ ముందు ఎవరైనా దిగదుడుపేనని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. పేదలకు అన్నివేళలా అండగా ఉంటూ ప్రతి పేదింటికి పెద్దన్నయ్యలా మారారని కొనియాడారు.

గర్భంలో శిశువుల నుంచి, మనుషుల మరణానంతరం వరకు అనేక ప్రభుత్వ సేవలు ఉచితంగా అందిస్తున్నారని, ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సీఎం కేసీఆర్ లక్ష్యం కూడా అదేనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపైనా విమర్శలు చేశారు.

రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలని సీఎం తపించిపోతుంటే, కేంద్రం మాత్రం వ్యవసాయాన్ని దండగ చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతుల భూములకు నూతన రెవెన్యూ చట్టంతో భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్ చూస్తుంటే, అవే రైతుల భూములను కార్పొరేట్ల పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.