అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష రాసిన సినీ నటి హేమ

27-09-2020 Sun 15:22
Tollywood actress Hema attends to Ambedkar Open University eligibility test
  • డిగ్రీ చేయాలని ఉందంటున్న హేమ
  • అర్హత పరీక్ష కోసం నల్గొండ వచ్చిన నటి
  • హైదరాబాదులో అయితే ఇబ్బంది అని వెల్లడి

టాలీవుడ్ నటి హేమ ఉన్నత విద్య అభ్యసించాలన్న కోరికను ఇన్నాళ్లకు తీర్చుకుంటున్నారు. తాజాగా హేమ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష రాశారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కొరకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇవ్వగా, హేమ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ అర్హత పరీక్ష నిర్వహించగా, హేమ కూడా హాజరయ్యారు. హేమకు నల్గొండ ఎన్జీ కాలేజీలో సెంటర్ కేటాయించారు. ఇతర విద్యార్థుల్లాగానే హేమ కూడా తనకు కేటాయించిన కేంద్రానికి వచ్చి పరీక్ష రాశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని తెలిపారు. అయితే హైదరాబాదులో తన ఫేమ్ దృష్ట్యా ఇబ్బంది ఉంటుందని భావించి నల్గొండలో పరీక్ష రాసినట్టు తెలిపారు. ఇక్కడ తనకు బంధువులు కూడా ఉన్నారని వెల్లడించారు.

పైగా హైదరాబాదులో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉంటాయని, నల్గొండ అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ తీసుకున్నానని వివరించారు.