హేమంత్‌ను పెళ్లి చేసుకుంటే విషం పెట్టి చంపేస్తామని మా అమ్మ చెప్పింది: అవంతి

27-09-2020 Sun 12:54
encounter my parents says avanti
  • నా తల్లిదండ్రులను ఎన్‌కౌంటర్ చేసి చంపేయండి
  • నాకు న్యాయం చేయాలి
  • హేమంత్‌తో ఎనిమిదేళ్ల నుంచి పరిచయం ఉంది
  • అన్యాయంగా చంపేశారు  

అవంతి అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న హైదరాబాద్‌లోని చందానగర్‌ వాసి హేమంత్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అవంతి కుటుంబ సభ్యులే హేమంత్‌ను హత్య చేయించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అవంతి ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన తల్లిదండ్రులను ఎన్‌కౌంటర్ చేసి చంపేయాలని ఆమె  కోరింది. తనకు న్యాయం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆమె కోరింది.

తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే తినే అన్నంలో విషం పెట్టి చంపేస్తామని తన తల్లి గతంలో చెప్పిందని అవంతి తెలిపింది. తాను తన ఇష్టపూర్వకంగానే హేమంత్‌ వద్దకు వచ్చానని, తమ  జీవితాన్ని తాము హాయిగా గడుపుతున్నామని చెప్పింది. తన భర్త  హేమంత్  ఎవరినీ మాటలతో కూడా నొప్పించడని ఆమె చెప్పింది.

అన్యాయంగా తన భర్తను చంపేశారని తెలిపింది. తన పుట్టింటి వాళ్లు ధనబలం చూపిస్తారని చెప్పింది. తనకు హేమంత్‌తో ఎనిమిదేళ్ల నుంచి పరిచయం ఉందని, తాము ఇంటర్ చదువుతున్నప్పుడే ఆ అబ్బాయిని కలవద్దని తల్లిదండ్రులు చెప్పడం మొదలుపెట్టారని తెలిపింది. కొన్ని నెలల క్రితం ఇంట్లో బంధించారని, అనంతరం ఈ మూడు నెలల్లో అంతా జరిగిపోయిందని ఆమె చెప్పింది. తన దృష్టిలో తన తల్లిదండ్రులు చచ్చిపోయారని వ్యాఖ్యానించింది.