స్టార్‌ హోటల్‌లో మాజీ సీఎం ఫడ్నవీస్‌ను కలవడంపై స్పందించిన శివసేన నేత సంజయ్‌ రౌత్

27-09-2020 Sun 10:49
CM was aware about our meeting Sanjay Raut Shiv Sena
  • పలు అంశాలపై చర్చించడానికే కలిశాను
  • ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి
  • మా మధ్య  సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి
  • అయినప్పటికీ మేము శత్రువులం కాదు

మహారాష్ట్రలోని శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై సంజయ్‌ రౌత్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

 పలు అంశాలపై చర్చించడానికే తాను నిన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశానని సంజయ్ రౌత్ తెలిపారు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అని, మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడని అన్నారు. అంతేగాక, బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఆయన బీజేపీ ఇన్‌ఛార్జీగా ఉన్నారని గుర్తు చేశారు. తమ మధ్య  సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, తాము శత్రువులం కాదని చెప్పారు. తాము సమావేశమైనట్లు సీఎం ఉద్ధవ్‌ థాకరేకు తెలుసని స్పష్టం చేశారు.

కాగా, దీనిపై ఇప్పటికే స్పందించిన బీజేపీ వివరణ ఇచ్చింది. సామ్నా పత్రిక కోసం ఓ ఇంటర్వ్యూ విషయంలో ఫడ్నవీస్‌ను సంజయ్ రౌత్ కలిశారని చెప్పుకొచ్చింది. కాగా, మహారాష్ట్రలోనూ పలు పార్టీల పొత్తుతో బీజేపీ అధికారంలో నిలవడానికి ప్రయత్నాలు జరిపే అవకాశాలు ఉన్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్‌ రౌత్, ఫడ్నవీస్‌ల భేటీ చర్చనీయాంశమైంది.