లూడో ఆటలో మోసం చేశాడట... తండ్రిపైనే కోర్టుకెక్కిన మధ్యప్రదేశ్ యువతి!

27-09-2020 Sun 08:56
  • ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన 24 ఏళ్ల యువతి
  • తండ్రి ఓడిపోతే బాగుంటుందని భావిస్తోంది
  • అది జరగకుంటే మోసమని చెబుతోందన్న కౌన్సెలర్లు

లూడో ఆడుతుంటే, తన తండ్రే తనను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ, ఆయనపై కోర్టులో కేసు వేసిన విచిత్రమైన యువతి ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, తామిద్దరమూ ఆడుతూ ఉంటే, తండ్రి మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ, 24 ఏళ్ల యువతి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తాను నాన్నను ఎంతో నమ్ముతూ ఉన్నానని, అయితే, ఆటలో ఆయనే మోసం చేస్తుంటే మాత్రం తట్టుకోలేక పోతున్నానని వాపోయింది. తాను సక్రమంగా ఆడుతూ ఉంటే, తండ్రి సరిగ్గా ఆడటం లేదని ఆరోపించింది.

ఇక ఈ కేసును ఓ మానసిక సమస్యగా తీసుకున్న భోపాల్ ఫ్యామిలీ కోర్టు, ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. ఇప్పటికే నాలుగుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు, ఆమె, తన ఆనందం కోసం తండ్రి ఓడిపోవాలని, ఓడిపోతే బాగుంటుందని కోరుకుంటోందని తేల్చారు. అది జరగకుంటే, తట్టుకోవడం లేదని, ఇప్పుడిప్పుడే ఆమె పాజిటివ్ గా స్పందిస్తోందని వెల్లడించారు.