Odisha: కరోనా టీకాను తయారు చేశానంటూ... ఒడిశా యువకుడి లేఖ, అధికారుల పరుగులు!

Odisha Man Claims that he Made a Vaccine for Corona
  • ఏడో తరగతి వరకూ చదివిన ప్రహ్లాద్
  • తన కరోనా టీకాకు అనుమతివ్వాలని లేఖ
  • పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు
చదివింది ఏడో తరగతి. అయితేనేం... ఏం ప్రయోగాలు చేశాడో, ఏం రసాయనాలు వాడాడో... తాను కరోనాకు టీకాను తయారు చేశానంటూ, అధికారులకు లేఖ రాశాడో వ్యక్తి. అంతేకాదు. దాన్ని మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖను కూడా రాశాడు. అంతేకాదు... అనుమతి లభించే వరకూ దాన్ని విక్రయించరాదని కూడా భావించాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ సమీపంలో జరిగింది.

అతని పేరు బీసీ ప్రహ్లాద్. ఒడిశాలోని బార్ఘర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ లేఖను అందుకున్న అధికారులు, అప్రమత్తమయ్యారు. హుటాహుటిన అతని ఇంటికి చేరుకుని, సోదాలు చేయగా, కరోనా వ్యాక్సిన్ అని రాసున్న వయల్స్ తో పాటు పలు రకాల కెమికల్స్ లభించాయి. ఈ టీకాను ఎలా చేశావని ప్రశ్నిస్తే, సమాధానం ఇవ్వలేదు సరికదా... మొత్తం తన ప్రయోగం అత్యంత రహస్యమని చెప్పాడు. అతన్ని పలు మార్లు విచారించినా ఇదే సమాధానం రావడంతో, ఇక చేసేదేమీ లేక అరెస్ట్ చేశారు.

పలు సెక్షన్ల కింద అతనిపై కేసు పెట్టామని వెల్లడించిన పోలీసులు, ఇదే తరహాలో అతను గతంలో ఏవైనా మందులు తయారు చేశానంటూ స్థానికులకు విక్రయించాడా? అన్న కోణంలో విచారణ మొదలు పెట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, స్థానికులు పుణ్యం చేసుకున్నారని, అతని వ్యాక్సిన్ బారిన పడకుండా చాలా మంది తప్పించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు.
Odisha
Corona Virus
Vaccine
7th Class

More Telugu News