మరో 24 గంటల పాటు వర్షాలు

27-09-2020 Sun 06:28
Rain Allert for 24 Hours
  • బలహీనపడిన అల్పపీడనం
  • కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • కొన్నిచోట్ల కుంభవృష్టికి అవకాశం

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు కోస్తా, రాయలసీమ లోని పలు ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్యప్రదేశ్,‌ దాని పరిసర ప్రాంతాల్లో ఉందని, అది నేడు బలహీనపడనుందని అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందునే వర్షాలు కురుస్తున్నాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టికి కూడా అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ఠానికి చేరుకుంది.