స్వీడన్ లో 8,400 ఏళ్ల నాటి శునకం అవశేషాలు లభ్యం

26-09-2020 Sat 22:01
Dog from mid stone age found by Swedish archaeologists
  • మధ్యరాతియుగానికి చెందిన శునకంగా గుర్తింపు
  • చనిపోయిన వ్యక్తితో పాటు కుక్కను పూడ్చినట్టు భావిస్తున్న పరిశోధకులు
  • మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్న స్వీడిష్ పురావస్తు శాస్త్రజ్ఞులు

దక్షిణ స్వీడన్ లో పురాతన కాలం నాటి ఓ శునకం అవశేషాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. ఈ శునకం దాదాపు 8,400 ఏళ్ల నాటిదని భావిస్తున్నారు. ఓ శ్మశానంలో ఈ కుక్క అవశేషాలు బయల్పడ్డాయి. దీన్ని పూడ్చినట్టుగా అక్కడి ఆధారాలను బట్టి అంచనా వేశారు.

మధ్య రాతియుగానికి చెందిన ఈ శునకం అవశేషాలు చెక్కుచెదరని స్థితిలో ఉండడం పట్ల పరిశోధకులు మాట్లాడుతూ, సముద్ర మట్టం పెరగడం వల్ల శ్మశాన వాటికలోకి బురద చేరి ఉంటుందని, ఆ బురద కింద శునకం అవశేషాలు భద్రంగా ఉండి ఉంటాయని పేర్కొన్నారు. ఆ శునకాన్ని పెంచుకున్న వ్యక్తి మరణించినప్పుడు అతడితో పాటు అతడికిష్టమైన వస్తువులను పూడ్చే సంప్రదాయంలో భాగంగా ఆ కుక్కను కూడా పూడ్చివేసి ఉంటారని వివరించారు.

శునకం అవశేషాలను శ్మశాన స్థలి నుంచి వెలికి తీసిన తర్వాత బ్లెకింగ్ మ్యూజియంకు తరలించనున్నారు. ఈ శునకం అవశేషాలను సాల్వ్స్ బర్గ్ పట్టణ సమీపంలో గుర్తించారు. ఈ అవశేషాల సాయంతో ఇక్కడి ప్రాంతంలో ఏ ప్రజలు నివసించారో, వారి నాగరికత ఎలాంటిదో తెలుసుకుంటామని, ఈ దిశగా మరిన్ని తవ్వకాలు చేపడతామని స్వీడన్ పురావస్తు శాస్త్రజ్ఞులు తెలిపారు.