కోల్ కతా ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచిన సన్ రైజర్స్

26-09-2020 Sat 21:38
Sunrisers set a low total against Kolkata Knight Riders
  • అబుదాబిలో కోల్ కతా వర్సెస్ సన్ రైజర్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్
  • నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 142 రన్స్

ఐపీఎల్ లో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ స్వల్ప స్కోరు సాధించింది. టాస్ గెలిచినా గానీ పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. డాషింగ్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో (5) ఆరంభంలోనే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ కాగా, కొన్ని ఓవర్ల తేడాతో కెప్టెన్ వార్నర్ (36) కూడా వెనుదిరిగాడు.

వన్ డౌన్ లో వచ్చిన మనీష్ పాండే (51) అర్ధసెంచరీతో రాణించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహా (30) ఫర్వాలేదనిపించాడు. చివర్లో స్కోరు మందగించింది. కోల్ కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ (19/1), వరుణ్ చక్రవర్తి (25/1) ఆకట్టుకునేలా బౌలింగ్ చేశారు.