ఐపీఎల్ 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

26-09-2020 Sat 19:16
  • అబుదాబి వేదికగా సన్ రైజర్స్ వర్సెస్ కోల్ కతా
  • మార్ష్ స్థానంలో నబీని తీసుకున్న సన్ రైజర్స్
  • బలమైన బ్యాటింగ్ లైనప్ తో బరిలో దిగుతున్న నైట్ రైడర్స్
Sunrisers won the toss against Kolkata Knight Riders

ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇటీవల పలు జట్లు టాస్ గెలిచి ఛేజింగ్ కు ప్రాధాన్యత ఇచ్చి బోల్తాపడిన నేపథ్యంలో, సన్ రైజర్స్ ఆ సాహసానికి పోలేదు.

మొదట బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ స్కోరు నిలపాలని సన్ రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ భావిస్తున్నాడు. గాయపడిన ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో ఆఫ్ఘన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ తుదిజట్టులోకి వచ్చాడు. మరోవైపు కోల్ కతా బ్యాటింగ్ బలోపేతంగా కనిపిస్తోంది. సునీల్ నరైన్, శుభ్ మాన్ గిల్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్ లతో ఎలాంటి ప్రత్యర్థి జట్లకైనా కష్టాలు తప్పవు.