Hemant: అవమానంతో రగిలిపోయిన లక్ష్మారెడ్డి కుటుంబం... అందుకే హేమంత్ హత్య!

Details of Hemant murder incident held at Hyderabad
  • హైదరాబాదులో పరువు హత్య
  • పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెల్లడి
  • కిరాయి హంతకుల సాయంతో ఘాతుకం
ప్రణయ్ హత్యోదంతం మరువక ముందే తెలంగాణ గడ్డపై మరో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్ అనే యువకుడిని అమ్మాయి తరఫు వ్యక్తులు అత్యంత దారుణంగా అంతమొందించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

హైదరాబాద్ చందానగర్ కు చెందిన హేమంత్, అవంతి రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయి జూన్ 11న లవ్ మ్యారేజి చేసుకున్నారు. ఈ పెళ్లి అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చనలకు ఇష్టం లేదు. అవంతి కులాంతర వివాహం చేసుకోవడంతో వారు ఎంతో అవమానంగా భావించి కొన్నినెలల పాటు ఇంట్లోంచి బయటికి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తన బావమరిది యుగేంధర్ రెడ్డి వద్ద తన బాధను వెల్లడించాడు.

దాంతో యుగేంధర్ రెడ్డి అక్క, బావ కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని తన సోదరుడు విజయేందర్ రెడ్డితో కలిసి ప్లాన్ వేశాడు. హేమంత్, అవంతి ఉంటున్న గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. రెండ్రోజుల కిందట హేమంత్ నివాసంలోకి బలవంతంగా చొరబడ్డారు. వారిలో అవంతి బంధువులు, కిరాయి హంతకులు కూడా ఉన్నారు.

హేమంత్ ను, అవంతిని వారు బలవంతంగా ఓ కారులో ఎక్కించి గోపన్ పల్లి వైపు తరలించారు. అయితే గోపన్ పల్లి వద్ద హేమంత్, అవంతి తప్పించుకునే ప్రయత్నం చేయగా వారిద్దరినీ మరోసారి కారులో ఎక్కించారు. కానీ, అదే రోజు రాత్రి కారులోనే హేమంత్ ను దారుణంగా హతమార్చారు.

కాగా, హత్యకు కొంత సమయం ముందు అవంతి మేనమామ యుగేంధర్ రెడ్డి... హేమంత్ తో మాట్లాడుతూ, అవంతిని వదిలేయాలంటే నీకు ఎంత కావాలి అని అడగ్గా, ప్రాణం ఉన్నంతవరకు అవంతిని వదులుకోను అని హేమంత్ చెప్పినట్టు తెలిసింది. దాంతో యుగేందర్ తో పాటు వచ్చిన కిరాయి హంతకులు... అయితే ఆ ప్రాణం మేం తీసేస్తాం అంటూ కిరాతకంగా చంపేసినట్టు వెల్లడైంది.
Hemant
Murder
Police
Hyderabad

More Telugu News