waragal: ఇండో-పాక్ సరిహద్దులో హైదరాబాద్ వాసి హల్‌చల్.. పాక్‌లోకి ప్రవేశించేందుకు యత్నం

Hyderabad man trying to cross indo pak border in rajasthan
  • వరంగల్ జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన పరమేశ్వర్
  • ఐదేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయిన వైనం
  • ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానించి అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్
ఇండో-పాక్ సరిహద్దులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఫెన్సింగ్ దాటి పాకిస్థాన్‌లో ప్రవేశించేందుకు యత్నించాడు. దీంతో అతడిని ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానించిన భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో అనుమానాస్పద కోణం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అధికారుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాలోని ఖానాపూర్‌కు చెందిన ఎన్.పరమేశ్వర్ (46)కు భార్య, కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి డైమండ్ పాయింట్ సమీపంలో నివసిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తల్లి చనిపోయినప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించేవాడు.  

ఈ క్రమంలో ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. రైలు ఎక్కి ఎక్కడికి వెళ్తే అక్కడ దిగేవాడు. ఈ క్రమంలో గురువారం రాజస్థాన్‌లో ప్రత్యక్షమయ్యాడు. జైసల్మేర్ ప్రాంతంలోని పోచ్చా ప్రాంతంలో ఉన్న ఇండో-పాక్ సరిహద్దుకు చేరుకుని ఫెన్సింగ్ దాటి పాకిస్థాన్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడ విధుల్లో ఉన్న జవాన్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తొలుత అతడిని ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానించారు. జిన్‌జిన్యాలీ పోలీస్ స్టేషన్‌కు తరలించి వివిధ కోణాల్లో ప్రశ్నించారు.

ఈ సందర్భంగా తన వివరాలు వెల్లడించాడు. అతడి తీరు అనుమానాస్పదంగా లేకపోవడంతో అక్కడి పోలీసులు ఖానాపూర్ పోలీసుల ద్వారా పరమేశ్వర్ సోదరుడు పుల్లయ్యకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు రాజస్థాన్ వెళ్లారు. అక్కడ అవసరమైన పత్రాలు సమర్పించడంతో పరమేశ్వర్‌ను వారికి అప్పగించారు. మతిస్థిమితం కోల్పోయిన తన సోదరుడు తన వివరాలను ఎలా చెప్పాడో అర్థం కావడం లేదని పరమేశ్వర్ సోదరుడు పుల్లయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తమను చూసి గుర్తుపట్టాడని, అయితే ఆ తర్వాత మాత్రం సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడని పేర్కొన్నాడు.
waragal
Hyderabad
Rajasthan
BSF
Indo-pak border

More Telugu News