Farmers: క్రమంగా ఒక్కో రాష్ట్రానికీ విస్తరిస్తున్న రైతు నిరసనలు!

  • దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన 265 రైతు సంఘాలు
  • 10 కేంద్ర వాణిజ్య సంఘాల మద్దతు
  • సమన్వయ పరుస్తున్న ఏఐకేఎస్సీసీ
  • వ్యవసాయ బిల్లులు వద్దే వద్దంటున్న రైతులు

ఇటీవల కేంద్రం పార్లమెంట్ లో ఆమోదింపజేసుకున్న వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, జరుగుతున్న రైతు నిరసనలు క్రమంగా ఒక్కో రాష్ట్రానికీ విస్తరిస్తున్నాయి. ఈబిల్లులను వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ కు పిలుపునివ్వగా, పంజాబ్, హర్యానాలతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకూ విస్తరించాయి. దేశవ్యాప్తంగా 265 రైతు సంఘాలు శుక్రవారం నాడు రోడ్డెక్కాయి. ఈ బిల్లులు రైతు వ్యతిరేకమని, వెంటనే వాటిని వెనక్కు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ బిల్లులను వెనక్కు తీసుకునే వరకూ తమ నిరసనలను ఆపబోమని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు, రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు స్పష్టం చేశాయి.

ఇక విపక్ష పార్టీలకు 10 కేంద్ర ట్రేడ్ యూనియన్లు కూడా మద్దతు ఇస్తుండటంతో నిరసనలు జోరుగా సాగుతున్నాయి. ఈ బిల్లులు చరిత్రాత్మకమైనవని, వీటి వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, మోదీ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులతో కనీస మద్దతు ధరను తాము కోల్పోతామని, ప్రైవేటు సంస్థలు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించి, చిన్న, మధ్యతరహా రైతుల పొట్టకొడతాయని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఈ సంస్కరణలతో చిన్న రైతులు తమ పంటకు గరిష్ఠ ధరను పొందుతారని శుక్రవారం జరిగిన ఓ వర్య్చువల్ సమావేశంలో మోదీ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను అత్యధిక శాతం రైతులు నమ్మడంలేదని జరుగుతున్న నిరసనలకు వస్తున్న మద్దతు తెలుపుతోందని విపక్ష పార్టీల నేతలు అంటున్నారు.

ఇక ఈ నిరసనలకు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్సీసీ) సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో రైతు సంఘాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. దాదాపు 100కు పైగా ఆర్గనైజింగ్ కమిటీల నుంచి నిరసనలకు మద్దతు లభిస్తోందని ఏఐకేఎస్సీసీ జనరల్ కార్యదర్శి అవిక్ సాహా వెల్లడించారు. ఇక, పంజాబ్ లో నిరసనలు పూర్తి స్థాయిలో జరుగుతుండగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హర్యానా, యూపీల్లోనూ చాలా ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. వీటిని అన్ని దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీసుకుని వెళ్లడంతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ్యాపించేలా చూడాలని విపక్ష పార్టీలు సమాలోచనలు సాగిస్తున్నాయి.

More Telugu News