నన్ను మోసగత్తె అన్నప్పుడు అనుష్క మౌనంగా ఉంది... ఇవాళ అదే అనుభవం ఆమెకు ఎదురైంది: కంగనా

25-09-2020 Fri 21:41
Kangana Ranaut condemns Gavaskar comments on Anushka Sharma
  • చర్చనీయాంశంగా మారిన గవాస్కర్ వ్యాఖ్యలు
  • గవాస్కర్ ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్న కంగనా
  • స్త్రీ విద్వేషం అనుష్కను కాటేసిందని వెల్లడి

క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను ప్రస్తావిస్తూ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించారు. గతంలో తాను కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎదుర్కొన్నానని, కానీ అప్పుడు అనుష్క శర్మ స్పందించకుండా మౌనంగా ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు నేను ముందుకొచ్చి సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అంటూ కంగనా ట్వీట్ చేశారు.

"గతంలో నన్ను బెదిరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నన్ను మోసగత్తె అన్నారు. ఇవాళ అదే తరహా స్త్రీ విద్వేషం అనుష్కను కాటేసింది. క్రికెట్ వ్యవహారాల్లోకి ఆమెను సునీల్ గవాస్కర్ లాగారన్న విషయాన్ని నేను ఖండిస్తున్నాను" అని పేర్కొన్నారు.

అయితే కేవలం పైశాచిక ప్రవృత్తి ఉన్నవాళ్లే సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలకు అసభ్యతను ఆపాదిస్తారని కంగనా వివరించారు. గవాస్కర్ తన వ్యాఖ్యల్లో అనుష్క గురించి ప్రస్తావించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అనుష్క తన తదుపరి చిత్రంలో క్రికెటర్ గా నటిస్తోందని, పైగా ఆమె తన భర్తతో ప్రాక్టీసు చేస్తున్న పలు వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు.