డ్రగ్స్ విచారణలో నలుగురి పేర్లను వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

25-09-2020 Fri 19:41
Rakul Preet Singh names four celebrities during NCB probe
  • రకుల్ ను నాలుగు గంటల పాటు విచారించిన ఎన్సీబీ
  • రియాతో డ్రగ్ చాట్ చేసినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం
  • తాను డ్రగ్స్ వాడలేదని వెల్లడి

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఈరోజు విచారించారు. దాదాపు నాలుగు గంటల సేపు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కీలక విషయాలను ఆమె వెల్లడించినట్టు తెలుస్తోంది. రియా చక్రవర్తితో డ్రగ్ చాటింగ్ చేసినట్టు ఆమె ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే, తాను డ్రగ్స్ ఎప్పుడూ వాడలేదని తెలిపింది. డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులతో కూడా తనకు సంబంధం లేదని చెప్పింది.

మరోవైపు ఓ సంచలన విషయాన్ని టైమ్స్ నౌ వెల్లడించింది. విచారణలో నలుగురు స్టార్ల పేర్లను రకుల్ వెల్లడించినట్టు టైమ్స్ తెలిపింది. అంతేకాదు ధర్మ ప్రొడక్షన్స్ (కరణ్ జొహార్ నిర్మాణ సంస్థ) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ ప్రసాద్ ఈ నలుగురికీ డ్రగ్స్ సరఫరా చేసేవాడని చెప్పినట్టు పేర్కొంది. రెగ్యులర్ గా ఆయన డ్రగ్స్ ను సేకరించేవాడని, పలువురు సెలబ్రిటీలకు వాటిని సరఫరా చేసేవాడని, వారిలో కనీసం నలుగురు స్టార్లు ఉన్నారని వెల్లడించినట్టు తెలిపింది.

విచారణ అనంతరం, ఎన్సీబీ ముంబై శాఖ డైరెక్టర్ జనరల్ అశోక్ జైన్ మాట్లాడుతూ, రకుల్ ప్రీత్ సింగ్ స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారని... ఆమె స్టేట్మెంట్ ను విశ్లేషించి, కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు.