ఏం గుర్తుకొచ్చినా కురిసేవి కన్నీటి జలపాతాలే: రామోజీరావు

25-09-2020 Fri 19:05
SP Balu is my brother says Ramoji Rao
  • బాలు మరణం మహా విషాదం
  • నన్ను గుండెలకు హత్తుకునే తమ్ముడు బాలు
  • ఆయన స్వరం ఒక వరం

వేలాది పాటలు పాడిన మధుర గాయకుడి మరణం మాటలకందని మహా విషాదమని రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాలు లేరంటే ఎంతో దిగులుగా ఉందని, మనసు మెలిపెట్టినట్టు ఉందని అన్నారు. బాలు తనకు అత్యంత ఆప్తుడని, గుండెకు హత్తుకుని ప్రేమించే తమ్ముడని చెప్పారు.

ప్రపంచ సంగీతానికి ఆయన స్వరం ఒక వరం అని రామోజీరావు అన్నారు. ఆయన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో వేలాది పాటలు జాలువారాయని చెప్పారు. ఎన్ని గానాలు, ఎన్ని గమకాలు, ఎన్ని జ్ఞాపకాలు... వీటిలో ఏం గుర్తుకు వచ్చినా కురిసేవి కన్నీటి జలపాతాలేనని అన్నారు. తమ కోసం ఎన్నో మధురమైన పాటలను మిగిల్చిపోయిన స్నేహితుడికి... కనీసం తిరిగి మాటలు కూడా ఇవ్వలేని విషాదమిదని ఆవేదన వ్యక్తం చేశారు. నీకిదే మా నివాళి అని చెప్పారు.