క్రికెట్ వ్యవహారాల్లోకి నాపేరు ఎందుకు లాగుతారు?: గవాస్కర్ పై మండిపడిన అనుష్క

25-09-2020 Fri 17:56
Anushka Sharma gets angry on Gavaskar comments
  • పంజాబ్ తో మ్యాచ్ లో ఘోరంగా ఆడిన కోహ్లీ
  • లాక్ డౌన్ లో అనుష్క బౌలింగ్ ఆడాడంటూ సన్నీ వ్యాఖ్యలు
  • ఈ వ్యాఖ్యలు సహించరానివంటూ అనుష్క పోస్టు

ఐపీఎల్ లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫీల్డింగ్ చేస్తూ రెండు క్యాచ్ లు చేజేతులా వదిలిపెట్టి, ప్రత్యర్థి కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీకి బాటలు వేశాడు. ఆపై బ్యాటింగ్ లోనూ ఘోరంగా ఆడాడు. 5 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 1 పరుగు చేసి కాట్రెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దీనిపై కామెంట్రీ బాక్స్ లో ఉన్న క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరదాగా స్పందించారు.

లాక్ డౌన్ సమయంలో కోహ్లీ తన భార్య అనుష్క శర్మ బౌలింగ్ ను మాత్రమే ఆడినట్టు ఉందని చమత్కరించారు. అయితే ఈ వ్యాఖ్యలను అనుష్క శర్మ తీవ్రంగా తప్పుబట్టింది. గవాస్కర్ వ్యాఖ్యలు సహించరానివిగా ఉన్నాయని మండిపడింది. "అయినా భర్త ఆట గురించి వ్యాఖ్యానించేటప్పుడు అతని భార్యను నిందించడం ఎందుకో చెబితే కాస్త బాగుంటుంది. ఇన్నేళ్ల మీ కామెంటేటర్ జీవితంలో క్రికెటర్ల వ్యక్తిగత వ్యవహారాలకు విలువ ఇచ్చారని తెలుసు. అదే గౌరవాన్ని మాకు ఇవ్వాలని అనిపించలేదా? గత రాత్రి మ్యాచ్ సందర్భంగా నా భర్త ఆటతీరుపై వ్యాఖ్యానించడానికి మీ మదిలో ఎన్నో పదాలు మెదిలి ఉంటాయని చెప్పగలను. లేకపోతే, నా పేరు ఉపయోగించి మాత్రమే వ్యాఖ్యలు చేయాలనుకున్నారా?

ఇది 2020. కానీ క్రికెట్ వ్యవహారాల్లోకి నా పేరు లాగడం మాత్రం ఆగలేదు. ఇలాంటి వ్యాఖ్యలను ఎప్పుడు మానుకుంటారు? గౌరవనీయ సునీల్ గవాస్కర్ గారూ మీరో దిగ్గజం. మీ మాటలు విన్నప్పుడు నాకేమనిపించిందో చెప్పాలనే ఈ పోస్టు చేస్తున్నాను" అంటూ అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.