మేం టీఆర్ఎస్ ప్రభుత్వంలా కాదు... హరీశ్ రావు వ్యాఖ్యలకు బాలినేని కౌంటర్

25-09-2020 Fri 17:06
AP Minister Balineni Srinivasa Reddy replies to Harish Rao comments
  • రూ.4 వేల కోట్లకు ఆశ పడ్డారంటూ హరీశ్ వ్యాఖ్యలు
  • కేంద్రంతో సఖ్యతగా ఉంటే తప్పేంటన్న బాలినేని
  • నిధులను ప్రజల కోసం ఉపయోగిస్తామని స్పష్టీకరణ

ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీలో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. కేంద్రం ఇస్తామన్న రూ.4 వేల కోట్లకు ఆశపడే సీఎం జగన్ మీటర్ల బిగింపుకు సమ్మతించారని ఆరోపించారు. తమకు కూడా కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తామని చెప్పిందని, కానీ కేంద్రం డబ్బుకు కక్కుర్తి పడి రైతుల మెడకు ఉరితాడు బిగించలేమని హరీశ్ రావు ఇటీవల దుబ్బాకలో వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.

కేంద్రం ఇచ్చే రూ.4 వేల కోట్ల నిధులను ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగిస్తాం తప్ప, వాటిని తమ జేబుల్లో వేసుకోబోమని స్పష్టం చేశారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా ఉండడం, మరో రోజు గొడవ పడడం తమ నైజం కాదని చురక అంటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉండడం తప్పెలా అవుతుందని బాలినేని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ బిల్లులకు సంబంధించి డిస్కంలకు చెల్లించవలసిన మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తామని, ఇందులో అనుమానించాల్సింది ఏముందని అన్నారు.