Rajamouli: చాలామంది తమిళ, కన్నడ సోదరులు బాలు తెలుగువాడంటే ఒప్పుకునేవాళ్లు కాదు: రాజమౌళి

Rajamouli mourns for the demise of legendary singer SP Balasubrahmanyam
  • బాలు మరణంపై రాజమౌళి స్పందన
  • బాలు మావాడేనంటూ గొడవ చేసేవాళ్లని వెల్లడి
  • అందరితో మావాడు అనిపించుకున్నారంటూ ట్వీట్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త సినీ రంగాన్ని కలచివేస్తోంది. చిత్ర రంగ ప్రముఖులు బాలు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అగ్రశ్రేణి తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ లో స్పందించారు. బాలు గారు తెలుగు, తమిళ, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలారని, ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదని, ఆ ఏలిక మరి రాదు అని కొనియాడారు.

చాలామంది తమిళ, కన్నడ సోదరులు ఎస్పీ బాలు తెలుగువాడంటే అంగీకరించేవాళ్లు కాదని, బాలు మావాడే అని గొడవ చేసేవాళ్లని తెలిపారు. అన్ని భాషల్లోనూ పాడి, అందరితోనూ 'మావాడు' అనిపించుకున్న ఘనత ఒక్క బాలు గారికే సాధ్యమైందని వివరించారు.

ఆయన పాడిన పాటలు, మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయన్న రాజమౌళి... మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తిప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు.
Rajamouli
SP Balasubrahmanyam
Demise
Telugu
Tamil
Kannada
Singer

More Telugu News