బాలు కోలుకుంటున్న తరుణంలో ఇలా జరుగుతుందనుకోలేదు: వెంకయ్యనాయుడు

25-09-2020 Fri 16:06
Venkaiah Naidu says he did not think that SP Balu demise happened while he was on recovery course
  • ఎస్పీ బాలు మరణంపై వెంకయ్య దిగ్భ్రాంతి
  • ప్రతి రోజూ డాక్టర్లతో మాట్లాడినట్టు వెంకయ్య వెల్లడి
  • బాలు కుమారుడికి కూడా సూచనలు చేశానంటూ ట్వీట్
  • వేలాది యువ గళాలను ప్రోత్సహించారంటూ కితాబు

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, ఐదున్నర దశాబ్దాలుగా తన అమృత గానంతో ప్రజలను అలరింపచేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడ్డారని తెలిసినప్పటి నుంచి డాక్టర్లతో రోజూ మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నానని వెల్లడించారు. బాలు కుమారుడితో కూడా మాట్లాడి కావాల్సిన సలహాలు ఇస్తూ, వైద్యులకు సూచనలు చేస్తుండేవాడినని తెలిపారు.

కానీ, బాలు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం విచారకరం అని వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో స్పందించారు. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ గళాలను వెలుగులోకి తీసుకువచ్చారని కొనియాడారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వివరించారు.