SP Balasubrahmanyam: రెండ్రోజుల్లో వచ్చేస్తానంటూ.. అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఇచ్చిన మాట తప్పిన బాలు!

  • ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరిన బాలు
  • బాలుకు ఫోన్ కాల్స్ వెల్లువ
  • అందరికీ సమాధానం చెప్పలేకపోయిన బాలు
  • రెండ్రోజుల్లో వచ్చేస్తానంటూ వీడియో సందేశం
  • జలుబు, జ్వరమేనంటూ వెల్లడి
SP Balasubrahmanyam dies in Chennai hospital

కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం... రెప్పపాటే కదా జీవితం అన్నాడు ఓ కవి. కానీ ఆ రెప్పపాటులో కోట్లాది మందిని మంత్రముగ్ధుల్ని చేయడం కొందరు కారణ జన్ములకే సాధ్యమవుతుంది. అలాంటి వాడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం... అభిమానులకు ఎస్పీ బాలు! బాణీల్లో ఒదిగిన సంగీత స్వరాలు ఆయన గానంతో అమృతాన్ని నింపుకుని శ్రోతలను ఓలలాడించాయన్నా, సంగీతానికి శిలలు కరిగాయన్న అతిశయోక్తి దాదాపు నిజమే అనిపించేలా చేశాడన్నా అది మన బాలూకే చెల్లుతుంది. వేల పాటలతో భారత సినీ సంగీత ప్రపంచాన్ని సుసంపన్న చేసిన అంతటి మధుర గాయకుడు ఇచ్చిన మాట తప్పేశాడు!

"నాకు వచ్చింది జ్వరమే.. ఇప్పుడది తగ్గుముఖం పడుతోంది... రెండ్రోజుల్లో డిశ్చార్జి అయి వచ్చేస్తాను..." అంటూ కరోనాతో ఆసుపత్రిలో చేరిన సందర్భంగా అందరికీ వీడియో ద్వారా మాటిచ్చేశాడు. మాటిచ్చాడు కానీ నిలుపుకోలేకపోయాడు! సర్వశక్తులు ఒడ్డినా ఆ రాకాసి వైరస్ తో పోరాడి అలసిపోయాడు. కరోనా నెగెటివ్ వచ్చినా ఊపిరితిత్తులు కొలిమితిత్తుల్లా మారిన నేపథ్యంలో ఇన్ఫెక్షన్ నుంచి మాత్రం కోలుకోలేకపోయాడు.

కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఎస్పీ బాలు ఆగస్టు 5 స్వల్ప లక్షణాలతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆయనను పరామర్శించేందుకు విపరీతంగా ఫోన్లు చేయసాగారు. వారందరికీ సమాధానం చెప్పలేక బాలు ఓ వీడియో విడుదల చేశారు.

"జలుబు, జ్వరం తప్ప నేను భేషుగ్గానే ఉన్నాను. జ్వరం కాస్త నెమ్మదించింది. ఇంకెంత... రెండ్రోజులే. డిశ్చార్జి అవుతాను... ఇంట్లో ఉంటాను. నాకెంతో మంది ఫోన్లు చేస్తున్నారు. వారందరి కాల్స్ మాట్లాడలేకపోతున్నాను. నేను ఆసుపత్రిలో చేరడానికి వచ్చిన ముఖ్య కారణం విశ్రాంతి తీసుకోవడానికే. అందుకే ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను బాగానే ఉన్నాను, బాగానే ఉంటాను. ఎవరూ కంగారు పడవద్దు" అంటూ అందరినీ ఉద్దేశించి పలికారు.

అభిమానులకు ఆయన అందించిన చివరి సందేశం బహుశా అదే అయ్యుంటుంది. కానీ వీడియోలో చెప్పినట్టుగా ఆయన రాలేకపోయాడు. అత్యంత విషాదాన్ని అందరిలో ఒలికిస్తూ, అనంతవాయువుల్లో లీనమయ్యాడు.

More Telugu News