యో-యో టెస్టు గురించి విరాట్ కోహ్లీని అడిగిన ప్రధాని మోదీ

24-09-2020 Thu 21:11
What is YO YO test PM asked Virat Kohli
  • ఫిట్ ఇండియా డైలాగ్ కార్యాచరణ తీసుకువచ్చిన మోదీ
  • సెలబ్రిటీలతో ముచ్చటించిన ప్రధాని మోదీ
  • బయటి తిండితో ఫిట్ నెస్ దెబ్బతింటోందన్న కోహ్లీ

దేశ ప్రజల దృఢత్వమే లక్ష్యంగా ఏడాది కిందట  ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా  కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏడాది నిండిన నేపథ్యంలో ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విరాట్ కోహ్లీ, మిలింద్ సోమన్ వంటి కొందరు సెలబ్రిటీలతో ఫిట్ ఇండియా డైలాగ్ పేరిట ప్రధాని ఆన్ లైన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లకు నిర్వహించే యో-యో టెస్టుపై మోదీ ఆసక్తి ప్రదర్శించారు. టీమిండియా సారథి కోహ్లీని యో-యో టెస్టు వివరాలు చెప్పాలంటూ అడిగారు.

ఆటగాళ్ల ఫిట్ నెస్ సామర్థ్యం అత్యున్నత స్థాయిలో ఉందా లేదా అని పరీక్షించేందుకు యో-యో టెస్టు నిర్వహిస్తామని కోహ్లీ బదులిచ్చాడు. ఓ ఆటగాడు 20 మీటర్ల దూరం మధ్యలో ఉంచిన లక్ష్యాలను బీప్ శబ్దాల ఆధారంగా ఛేదించాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియతో ఆటగాడి ఫిట్ నెస్ స్థాయి ఎంత మేర ఉందో స్పష్టంగా తెలిసిపోతుందని వివరించాడు.

అంతేగాకుండా, ఫిట్ నెస్ పైనా కోహ్లీ తన అభిప్రాయాలు వెల్లడించాడు. మన పూర్వీకులు సంప్రదాయ ఆహారం తీసుకుని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, ఇప్పటిరోజుల్లో బయటి తిండికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఫిట్ నెస్ స్థాయి దిగజారిందని విచారం వ్యక్తం చేశాడు. తన రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో ఫిట్ నెస్ ఓ భాగంగా మారిందని కోహ్లీ వెల్లడించాడు.