గత 24 గంటల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం బాగా క్షీణించింది: ఎంజీఎం ఆసుపత్రి ప్రకటన

24-09-2020 Thu 18:52
Chennai MGM doctors released health bulletin of SP Balasubrahmanyam
  • బులెటిన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి
  • బాలు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడి
  • వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స చేస్తున్నట్టు వివరణ

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారని, ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతోందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు. అయితే గత 24 గంటల్లో ఆయన పరిస్థితి బాగా క్షీణించిందని, ఆయనకు అత్యున్నత స్థాయిలో లైఫ్ సపోర్ట్ సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.

ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఎంజీఎం ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం బాలు ఆరోగ్య పరిస్థితిని ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని ఎంజీఎం ఆసుపత్రి వైద్య సేవల ఏడీ డాక్టర్ అనురాధ భాస్కరన్ పేరిట విడుదలైన ఆ బులెటిన్ లో పేర్కొన్నారు.