నోటీసులపై దీపిక స్పందించింది: ఎన్సీబీ వెల్లడి

24-09-2020 Thu 17:50
NCB says Deepika Padukone has acknowledged to summons
  • సుశాంత్ మృతిలో డ్రగ్స్ కోణం
  • దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ అధికారులు
  • ఇప్పటికే రియా చక్రవర్తి అరెస్ట్
  • రియా వాంగ్మూలం ఆధారంగా పలువురికి నోటీసులు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో మొదలైన రగడ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి డ్రగ్స్ కుంభకోణం రూపంలో హీరోయిన్ల మెడకు చుట్టుకుంది. సుశాంత్ వ్యవహారంలో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు పలువురు తారలకు నోటీసులు పంపారు. దీపికా పదుకొణే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ వంటి హీరోయిన్లే కాకుండా, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాలకు నోటీసులు వెళ్లాయి.

ఈ నేపథ్యంలో, ఎన్సీబీ అధికారులు స్పందించారు. తాము పంపిన నోటీసులు అందినట్టు దీపికా పదుకొణే బదులిచ్చారని వెల్లడించారు. దీపిక తదితరులను విచారిస్తే మరింత సమాచారం వెల్లడవుతుందని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు. కాగా, ఓ సినిమా షూటింగ్ కోసం దీపిక ప్రస్తుతం గోవాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్సీబీ నోటీసుల నేపథ్యంలో ఆమె తన న్యాయవాదితో సంప్రదిస్తున్నట్టు సమాచారం.