మీటర్లు కావాలంటే బీజేపీకి, మీటర్లు వద్దనుకుంటే టీఆర్ఎస్ కు ఓటేయండి: హరీశ్ రావు

24-09-2020 Thu 15:32
Harish Rao comments on BJP during passbooks distribution in Rayapol
  • రైతుల కోసం టీఆర్ఎస్ సర్కారు ఎంతో చేసిందన్న హరీశ్
  • బీజేపీ రైతులపై బాంబులు వేస్తోందంటూ విమర్శలు
  • సంక్రాంతి గంగిరెద్దులు అంటూ హరీశ్ వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీటర్లు కావాలనుకుంటే బీజేపీకి, మీటర్లు వద్దు అనుకుంటే మన కేసీఆర్ సారుకు, టీఆర్ఎస్ కారుకు ఓటేయాలని అన్నారు.

గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ సర్కారు రైతుల కోసమే పనిచేసిందని, కానీ బీజేపీ రైతులకు మేలు చేయకుండా బాంబులు వేస్తోందని విమర్శించారు. బావుల వద్ద, బోర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేసి, బిల్ కలెక్టర్లతో వసూళ్లు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే, ప్రజలు సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఓట్ల కోసం వచ్చే వారెవరో, కష్టపడి పనిచేస్తున్నది ఎవరో గుర్తించాలని తెలిపారు. తెలంగాణలో కరోనా వంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా నిలిచిపోలేదని స్పష్టం చేశారు.