పాకిస్థాన్ లో ఇదో రకం పరువు హత్య... సోదరిని తొమ్మిదేళ్ల బాలుడి చేత కాల్చి చంపించిన సోదరుడు!

24-09-2020 Thu 15:18
Honor Killing in Pakistan as nine years old boy shoot his aunt
  • పదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకుని వెళ్లిపోయిన మహిళ
  • శుభకార్యం అంటూ పిలిచి చంపేసిన సోదరుడు  
  • గత కొన్ని రోజులుగా కాల్చడంలో బాలుడికి తర్ఫీదు

పాకిస్థాన్ లో దారుణమైన రీతిలో పరువు హత్య జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతో 30 ఏళ్ల మహిళను దారుణమైన రీతిలో మేనల్లుడితో చంపించారు. మేనల్లుడి వయసు 9 ఏళ్లే. లాహోర్ కు 200 కిలోమీటర్ల దూరంలో సర్గోదా గ్రామానికి చెందిన మహిళ పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులకు ఇష్టంలేకపోయినా, తన ప్రియుడ్ని పెళ్లాడి అతడితో వెళ్లిపోయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా కలిగారు.

తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఆమెపై కుటుంబ సభ్యులు కసితో రగిలిపోయారు. ఇటీవల కొంతకాలంగా ఆ మహిళతో కుటుంబ సభ్యులు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే అది ఓ క్రూర పన్నాగం అని తెలుసుకోలేకపోయింది. కొన్నిరోజుల కిందట, ఇంట్లో శుభకార్యం ఉందంటూ ఆమెను సోదరుడు తమ ఇంటికి ఆహ్వానించాడు. కుటుంబ సభ్యులందరూ తనను ఆదరిస్తుండడం పట్ల ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఎంతో ఉత్సాహంతో తన అన్న ఇంటికి వచ్చిన ఆమెకు అవే ఆఖరి క్షణాలు అయ్యాయి.

ఆమె సోదరుడు తన 9 ఏళ్ల కుమారుడికి తుపాకీ ఇచ్చి కాల్చమని చెప్పగా, ఆ బాలుడు మేనత్తపై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దాంతో ఆమె సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన  తర్వాత ఆమె అన్న కుటుంబం ఆ ఊరి నుంచి పారిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఆ బాలుడికి గత కొన్నిరోజులుగా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇస్తున్నా, దానివెనుక కుట్ర దాగి వుందని గుర్తించలేకపోయారు. ఈ ఘటనతో పాక్ లో మానవ హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.