సహజసిద్ధంగా దొరికే వస్తువులతో దోమల నివారణ ఇలా చేయొచ్చు!

24-09-2020 Thu 14:53
Mosquito prevention through natural ways
  • వర్షాకాలంలో అధికంగా కనిపించే దోమల బెడద
  • డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం
  • వెల్లుల్లి, తులసితో దోమలను తరిమివేయొచ్చంటున్న నిపుణులు

వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద అంతకు రెండింతలవుతుంది.  దోమల కారణంగా వచ్చే డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా, ఇతర విష జ్వరాలు ఈ సీజన్ లో ప్రబలమవుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏ కాలంలో అయినా దోమలు స్వైరవిహారం చేస్తుంటాయి. మురికి కాల్వలు, నీరు నిల్వ ఉండడమే అందుకు కారణం. అందుకే వర్షాకాలం వచ్చిందంటే ప్రభుత్వాలు దోమలపై యుద్ధం ప్రకటిస్తుంటాయి. వాటిని తరిమేందుకు సాధారణంగా రసాయనాలు వాడుతుంటారు.

అయితే సహజ పద్ధతుల్లో, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో దోమలను పారదోలవచ్చని నిపుణులు చెబుతున్నారు. పైగా ఖర్చు కూడా తక్కువ. వీటిలో కొన్ని మన వంటింట్లో ఉండే వస్తువులే. వెల్లుల్లి, తులసి, లవంగాలు, జామాయిలు (యూకలిప్టస్), లావెండర్, పిప్పర్ మెంట్, రోజ్ మేరీ, జెరానియోల్, లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, సెడార్ వుడ్ సాయంతో దోమలను నివారించవచ్చని అంటున్నారు. వెల్లుల్లి వాసన అంటే దోమలకు అస్సలు నచ్చదట. వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా దోమలను అల్లంత దూరంలో ఉంచవచ్చు.

తులసి చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! ఎన్నో ఔషధ గుణాలకు నెలవు తులసి. దాదాపు ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. దీని ఆకుల నుంచి సేకరించిన నూనెతో దోమలను పారదోలవచ్చు. అంతేకాదు, పైన పేర్కొన్న లెమన్ గ్రాస్, రోజ్ మేరీ, లావెండర్ పరిమళాలు కూడా దోమలకు ప్రబల శత్రువులు. ఇక, పొగబెట్టడం ద్వారా కూడా దోమలను ఇళ్లలోకి రాకుండా చేయొచ్చు. నిప్పులపై తులసి ఆకులు, వేప వంటి ప్రకృతి సిద్ధంగా దొరికేవాటితో దోమలపై యుద్ధభేరి మోగించవచ్చు.