Pawan Kalyan: రథం తయారీలో అగ్నికుల క్షత్రియులను భాగస్వాములను చేయాలి: పవన్ కల్యాణ్

  • అంతర్వేది నారసింహుడిని అగ్నికుల క్షత్రియులు కుల దైవంగా భావిస్తారు
  • తొలి కొబ్బరికాయను కొట్టి రథాన్ని లాగేది వారే
  • కొత్త రథం రూపకల్పన కమిటీలో వారికి స్థానం లేకపోవడం శోచనీయం
Pawan Kalyans new request to AP govt

అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రథాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ విన్నపం చేశారు.

రథం నిర్మించడంలో ఆలయ సంప్రదాయాలు, స్థానికుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని అగ్నికుల క్షత్రియులు తమ కుల దైవంగా పూజిస్తుంటారని... ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రియులైన కొపనాతి కృష్ణమ్మగారు నిర్మించారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తొలి రథాన్ని కూడా ఆమే రూపొందించారని చెప్పారు.

శిథిలావస్థకు చేరిన ఆ రథం స్థానంలో స్థానిక అగ్నికుల క్షత్రియులు మరో రథాన్ని తయారు చేశారని... మొన్న దగ్ధమైన రథం అదేనని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న కొత్త రథం రూపకల్పన కమిటీలో అగ్నికుల క్షత్రియులకు ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని అన్నారు. రథోత్సవం రోజున తొలి కొబ్బరికాయ కొట్టి రథాన్ని లాగేది వారేనని... అలాంటి వారి మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రథం తయారీలో వారిని భాగస్వాములను చేయాలని కోరారు.

More Telugu News