ఆయన మాస్కు పెట్టుకోరు, వేరే వాళ్లు పెట్టుకుంటే ఒప్పుకోరు: సీఎం జగన్ పై లోకేశ్ విసుర్లు

24-09-2020 Thu 13:14
TDP MLC Nara Lokesh questions CM Jagan for not wearing mask
  • సీఎం మాస్కు ధరించడంలేదంటూ లోకేశ్ ట్వీట్
  • మూర్ఖత్వానికి మానవ ప్రతిరూపం అంటూ విమర్శలు
  • చీరాల యువకుడు కిరణ్ మృతి ఉదంతం ప్రస్తావన

సీఎం జగన్ బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడంలేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. లక్షల్లో కరోనా కేసులు వస్తున్నాయని, వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని, అయినా జగన్ మాత్రం మూర్ఖత్వానికి మానవ ప్రతిరూపంగా మిగిలిపోయారని విమర్శించారు. ఆయన మాస్కు పెట్టుకోరు, వేరే వాళ్లను పెట్టుకోనివ్వరు అని ఆరోపించారు. ఈ క్రమంలో లోకేశ్ ఓ వీడియో కూడా పంచుకున్నారు.

ఈ సందర్భంగా లోకేశ్... చీరాల యువకుడు కిరణ్ మృతి ఉదంతాన్ని కూడా ప్రస్తావించారు. సీఎం మాస్కు పెట్టుకోనప్పుడు దళిత యువకుడు కిరణ్ ని మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపడం ఎందుకని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లో కిరణ్ ని చంపింది మాస్కు వేసుకోలేదనా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటూ ట్వీట్ చేశారు.