సంజయ్ లీలా భన్సాలీతో విజయ్ దేవరకొండ హిందీ చిత్రం!

24-09-2020 Thu 12:59
Sanjay Leela Bhansali to produce a flick with Vijay Devarakonda
  • విజయ్ దేవరకొండ తొలి డైరెక్ట్ హిందీ చిత్రం 
  • బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో కథ
  • యుద్ధవీరుడు అభినందన్ పాత్రలో విజయ్
  • టీ-సీరీస్ తో కలసి సంజయ్ సంయుక్త నిర్మాణం  

తన స్టయిల్.. డైలాగ్ మాడ్యులేషన్ తో తెలుగు హీరోలలో ఓ ప్రత్యేకత సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హిందీ సినిమాలో నటిస్తాడంటూ గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ నటించే తొలి డైరెక్ట్ హిందీ చిత్రం కన్ఫర్మ్ అయినట్టు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పైగా, ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఈ ప్రాజక్టును చేబడుతున్నట్టు చెబుతున్నారు.

గతేడాది పాకిస్థాన్లోని బాలాకోట్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సాహస దాడుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ దాడుల సందర్భంగా పాకిస్తాన్ కి చిక్కి, వెంటనే విడుదలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధవీరుడు, వింగ్ కమాండర్ అభినందన్ పాత్రను విజయ్ ఇందులో పోషిస్తాడు.

గతంలో 'రాక్ ఆన్', 'కేదార్ నాథ్' వంటి చిత్రాల ద్వారా పేరుతెచ్చుకున్న అభిషేక్ కపూర్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. ఇక సంజయ్ లీలా భన్సాలీతో కలిసి ఈ చిత్రాన్ని టీ-సీరీస్ సంస్థ నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని భావిస్తున్నారు. ఇదిలావుంచితే, ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేస్తారు. ఆ హిందీ వెర్షన్ ని కరణ్ జొహార్ విడుదల చేయనున్నారు.