joe biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు జో బైడెన్‌ను ఇరకాటంలో పడేసిన కుమారుడి వ్యవహారం!

  • చైనీయులు సహా విదేశీ పౌరులతో వ్యాపార లావాదేవీలు
  • 87 పేజీల ఈ మధ్యంతర నివేదిక విడుదల చేసిన రిపబ్లికన్లు
  • చైనీయుడితో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు
joe biden son connections with china

నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి డెమోక్రట్‌ అభ్యర్థి జో బైడెన్‌ గట్టి పోటీనిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సమయంలో తన కుమారుడు హంటర్‌ బైడెన్‌ ఓ వివాదంలో చిక్కుకోవడం జో బైడెన్‌ను ఆందోళన కలిగిస్తోంది.

చైనీయులు సహా విదేశీ పౌరులతో హంటర్ అనుసరించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన 87 పేజీల ఈ మధ్యంతర నివేదికను సెనేట్‌ రిపబ్లికన్లు విడుదల చేశారు. హంటర్‌ బైడెన్‌ చైనా ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న చైనా పౌరులతో ఎన్నో ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్లు అందులో ఉంది. చైనా ఎనర్జీ ఫండ్‌ కమిటీ (సీఈ ఫండ్‌) బోర్డు చైర్మన్‌ యే జియాన్మింగ్‌తోనూ ఆయన ఆర్థిక లావాదేవీలు జరిపారు.

చైనా సర్కారుతో యే జియాన్మింగ్‌ విస్తృతమైన సంబంధాలు కలిగి ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. ఆయనకు చైనా ఆర్మీతోనూ గతంలో సంబంధం ఉండేది. యే నుంచి హంటర్ బైడెన్ లక్షలు సంపాదించారు. హంటర్ బైడెన్ కుటుంబం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ పౌరులు, విదేశీ ప్రభుత్వాలతో భారీ ఆర్థిక సంబంధాలు కలిగి వుందని ఆ నివేదికలో చెప్పారు.

అవినీతిపరుడైన ఒలిగార్చ్ మైకోలా జ్లోచెవ్‌స్కీతో ఆర్థిక వ్యవహారాలు కొనసాగించారని కూడా పేర్కొన్నారు. హంటర్ బైడెన్, అతని కుటుంబం పలువురు చైనా పౌరులతో కూడా సంబంధం కలిగి ఉంది. చైనీయుడు గోంగ్వెన్ డాంగ్, హంటర్ బైడెన్ పేరిట జాయింట్‌ అకౌంట్‌ ఒపెన్‌ చేసిన తరువాత హంటర్, జేమ్స్, సారా బైడెన్‌లు అందులోంచి 1,00,000 డాలర్లు ఖర్చు చేశారని నివేదికలో పేర్కొన్నారు. వారి మధ్య జరిగిన లావాదేవీల్లో చాలావరకు ఆర్థిక నేర కార్యకలాపాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాదు, జో బైడెన్‌ సోదరుడు జేమ్స్‌ బైడెన్‌తోనూ యే జియాన్మింగ్‌కు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని నివేదికలో చెప్పారు.

More Telugu News