నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నా: సినీ నటి కస్తూరి

24-09-2020 Thu 12:34
I am also faced sexual harassment says actress Kasturi
  • సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నాకు వేధింపులు ఎదురయ్యాయి
  • అనురాగ్ పై పాయల్ ఆరోపణల వల్ల ఉపయోగం లేదు
  • ఆరోపణలకు ఆధారాలను చూపించలేం

తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ఇప్పటికే ఎందరో హీరోయిన్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో దక్షిణాది సీనియర్ నటి కస్తూరి స్పందించారు.

అనురాగ్ కశ్యప్ పై పాయల్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆమె చెప్పారు. ఆ ఆరోపణలకు ఆధారాలు ఉండవని... కోర్టుల్లో ఇవి నిలబడవని అన్నారు. ఈ మేరకు ఆమె చేసిన ఓ ట్వీట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ... పాయల్ పరిస్థితి మీ కుటుంబంలో ఎవరికైనా వస్తే ఇలాగే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. దీనిపై కస్తూరి స్పందిస్తూ తన కుటుంబం వరకు ఎందుకు? తానే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు. సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనకు వేధింపులు ఎదురయ్యాయని తెలిపారు. కస్తూరి చేసిన తాజా వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.