ఇదంతా నాన్ సెన్స్... ఆ మాటలు వద్దు: ధోనీపై కెవిన్ పీటర్సన్ సెటైర్లు

24-09-2020 Thu 12:19
Kevin Peterson Setires on MS Dhoni
  • రెండో మ్యాచ్ లో ఓడిపోయిన సీఎస్కే
  • తాను సన్నద్ధంగా లేనని వ్యాఖ్యానించిన ధోనీ
  • టీ-20ల్లో సమయం అధికంగా ఉందన్న కెవిన్
  • తదుపరి మ్యాచ్ లలో సీనియర్లు ముందుగా రావాలి
  • స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు

అసాధ్యమైన లక్ష్యమేమీ కాదు... టీ-20ల్లో 200కు పైగా స్కోర్లను గతంలో సునాయాసంగా ఛేదించిన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్... పైగా మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో టైటిల్ ను సాధించే సత్తా ఉన్న జట్టుగా అందరూ భావిస్తున్న టీమ్, తన రెండో మ్యాచ్ లో చతికిలబడింది.

ఈ మ్యాచ్ లో ధోనీ 7వ నంబర్ ఆటగాడిగా రావడం, మంచి ఫినిషర్ గా పేరున్నా, 16 పరుగుల తేడాతో జట్టు ఓడిపోవడం, తన నిర్ణయాన్ని ధోనీ సమర్ధించుకుంటూ, క్వారంటైన్, కరోనా కేసులతో తాను పూర్తి సన్నద్ధంగా లేకపోయానని చెప్పడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తున్నాయి.

తాజాగా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ధోనీ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. ఇదంతా నాన్ సెన్స్ అని, క్వారంటైన్ నిబంధనలు అన్ని జట్లకూ వర్తిస్తాయని అన్నాడు. "ఇదేమీ ప్రయోగాలు చేసేందుకు సమయం కాదు. ప్రస్తుతం మనం టోర్నమెంట్ తొలి రోజుల్లోనే ఉన్నాము. నేను ఒక్క విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. టీ-20లో ఏది జరిగినా చాలా త్వరగా అభిమానుల్లోకి వెళ్లిపోతుంది. వరుసగా ఐదు గేమ్ లలో ఓడిపోయిన జట్టు కూడా, త్వరగా కోలుకుని, ఫైనల్స్ కు చేరే అవకాశాలు ఉంటాయి. ఓటమిపై కుంటి సాకులు చెప్పాలని చూడవద్దు" అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పీటర్సన్ వ్యాఖ్యానించారు.

టీ-20 మ్యాచ్ లలో ప్రయోగాలను తక్కువగానే చేయాలని సలహా ఇచ్చిన ఆయన, శామ్ లేదా జడేజాలను ముందు పంపడం వరకూ సరైన నిర్ణయమే కావచ్చని, అయితే, ధోనీ ఎదురుచూసేలా, అవకాశాలు వచ్చేంత సమయం మ్యాచ్ లలో లభించడం చాలా తక్కువగా మాత్రమే జరుగుతుందని, రాగానే బ్యాట్ కు పనిచెబితేనే ఫలితం తారుమారయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని అన్నారు. రాబోయే మ్యాచ్ లలో సీనియర్లు ముందే బరిలోకి దిగి, బాధ్యతను తమపై వేసుకుంటారనే భావిస్తున్నట్టు తెలిపారు. లేకుంటే, మ్యాచ్ ల్లో ఫలితాలు ఇలాగే ఉంటాయని హెచ్చరించారు.