Rakul Preet Singh: డ్రగ్స్‌ కేసులో తనకు సమన్లు అందలేదంటోన్న హీరోయిన్‌ రకుల్

Rakul Preet Singh denies receiving summons news
  • మేనేజర్‌తో ప్రకటన చేయించిన భామ
  • కొట్టిపారేసిన ఎన్సీబీ అధికారులు
  • నోటీసులు ఇచ్చామని స్పష్టం
  • హైదరాబాదు నుంచి ముంబై చేరిన రకుల్
డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరు కావాలని హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు హీరోయిన్ల ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారని వార్తలు వచ్చాయి.

అయితే, ఇంతవరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని రకుల్‌ చెప్పుకొచ్చింది. తనకు హైదరాబాద్‌, ముంబైలో ఎక్కడా ఎన్సీబీ నుంచి సమన్లు అందలేదని తన‌ మేనేజర్ ద్వారా‌ ఒక ప్రకటన విడుదల చేయించింది. కాగా, షూటింగ్ కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆ భామ నిన్న రాత్రి తిరిగి ముంబైకి వెళ్లింది.

ఇదిలావుండగా, తనకు సమన్లు అందలేదంటూ రకుల్ చేసిన వ్యాఖ్యలను ఎన్సీబీ సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా కొట్టిపారేశారు. రకుల్‌కు సమన్లు జారీ చేశామని, ఆమె ఫోన్‌లో అందుబాటులోకి లేకపోవడంతో వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించామని చెప్పారు. అయితే, ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. ఆమె ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేదని స్పష్టం చేశారు. కాగా, డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొణే వంటి సెలబ్రిటీలను కూడా అధికారులు విచారించనున్న విషయం తెలిసిందే.
Rakul Preet Singh
Bollywood
Tollywood

More Telugu News