Warangal Rural District: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త గొంతు బిగించి చంపిన భార్య

wife killed husband in nekkonda over illegal affair
  • వరంగల్ రూరల్ జిల్లాలోని నెక్కొండలో ఘటన
  • బాధితుడు హన్మకొండలో హోంగార్డు
  • కాల్‌డేటాతో బయటపడిన భార్య దుర్మార్గం
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న అక్కసుతో ఓ మహిళ తన భర్త గొంతు బిగించి హత్య చేసింది. వరంగల్ రూరల్ జిల్లాలోని నెక్కొండలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గేటుపల్లి తండాకు చెందిన దర్యావత్ సింగ్ (42) హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.

ఆరేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసలపల్లికి చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం నెక్కొండలో ఉంటున్నారు. దర్యావత్ భార్య జ్యోతికి అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన సాంబరాజు అనే యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన భర్త పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

కరోనా కారణంగా దర్యావత్ గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో ప్రియుడిని కలుసుకోవడం జ్యోతికి ఇబ్బందిగా మారింది. అతడిని అడ్డుతొలగించుకోవాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో ఈ నెల 14న భర్త మద్యం తాగి ఇంటికి రావడంతో ఇదే అదునుగా భావించిన జ్యోతి ప్రియుడు సాంబరాజుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడిని హతమార్చేందుకు ఇదే మంచి సమయమని చెప్పింది.

ప్రియురాలి నుంచి ఫోన్ వచ్చిన మరుక్షణమే ఇంట్లో వాలిపోయిన సాంబరాజు.. జ్యోతితో కలిసి దర్యావత్ గొంతు బిగించి హత్యచేశారు. అనంతరం వెంట తెచ్చిన ట్రాలీ ఆటోలో మృతదేహాన్ని వేసుకుని, పత్తి చేనులోకి తీసుకెళ్లిన సాంబరాజు పెట్రోలు పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. మరుసటి రోజు వెళ్లి చూడగా మృతదేహం సగమే కాలింది. దీంతో మృతదేహాన్ని పూర్తిగా కాల్చేసి బూడిదను తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు.

దర్యావత్ కనిపించకపోవడంతో అతడి అన్న వీర్రాజు ఈ నెల 21న నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జ్యోతి తీరుపై అనుమానంతో ఆమె కాల్‌డేటాను సేకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు అంగీకరించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
Warangal Rural District
Nekkonda
wife
Husband
Murder
Crime News

More Telugu News