Mumbai Indians: రోహిత్ మెరుపులు.. ముంబై ఘన విజయం

Mumbai Indians record their first win in IPL
  • తొలి విజయాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్
  • చెలరేగి ఆడిన రోహిత్ శర్మ
  •  కోల్‌కతా నైట్‌రైడర్స్ పేలవ ప్రదర్శన
ఐపీఎల్‌లో భాగంగా నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా బోల్తాపడింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసి 49 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

కెప్టెన్ దినేశ్ కార్తీక్ (30), నితీశ్ రాణా (24),  పాట్ కమిన్స్ (33) మినహా జట్టులో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ముంబై బౌలర్లకు తలొగ్గిన బ్యాట్స్‌మెన్ వరుసపెట్టి వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో ఏ దశలోనూ జట్టు లక్ష్యం వైపుగా వెళ్లలేదు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్‌సన్, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్‌లు రెండేసి వికెట్లు పడగొట్టగా, కీరన్ పొలార్డ్ ఓ వికెట్ తీసుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 8 పరుగుల వద్ద ఓపెనర్ డికాక్ (1) అవుటయ్యాడు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. 54 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 80 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. మరోవైపు, సూర్యకుమార్ కూడా బ్యాట్ ఝళిపించాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేసి ఆఫ్ సెంచరీ ముంగిట రనౌటయ్యాడు.

వీరిద్దరూ అవుటైనప్పటికీ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా అదే జోరు కొనసాగించారు. సౌరభ్ తివారీ 21 (13 బంతుల్లో), హార్దిక్ పాండ్యా 18 (13 బంతుల్లో), పొలార్డ్ 13 (7 బంతుల్లో) పరుగులు చేయడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 195 పరుగులు చేసింది. భారీ స్కోరు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఐపీఎల్‌లో ముంబైకి ఇది తొలి విజయం.
Mumbai Indians
Kolkata knght riders
IPL 2020
Rohit Sharma

More Telugu News