ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు.. సందర్శకులను ఖాళీ చేయించిన అధికారులు

23-09-2020 Wed 19:58
Eiffel Tower Reopens After Bomb Scare In Paris
  • ఫోన్‌ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు
  • సందర్శకులను ఖాళీ చేయించి తనిఖీలు చేసిన పోలీసులు
  • ఫేక్ ఫోన్ కాల్ అని నిర్ధారణ.. సందర్శకులకు అనుమతి

131 ఏళ్ల చరిత్ర కలిగిన పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌లో బాంబు పెట్టామని, మరికాసేపట్లో అది పేలిపోతుందని ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు ఈఫిల్ టవర్ పరిసరాలను ఖాళీ చేయించారు. సందర్శకులను హుటాహుటిన అక్కడి నుంచి తరలించి బారికేడ్లు ఏర్పాటు చేశారు.

 సియెనే నది నుంచి ట్రోకాడెరో ప్లాజా వరకు ఉన్న వంతెనను, టవర్ కింద ఉన్న వీధులను అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబు జాడ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు వచ్చింది ఫేక్ ఫోన్ కాల్ అని నిర్ధారించి రెండు గంటల తర్వాత బారికేడ్లను తొలగించి సందర్శకులను తిరిగి అనుమతించారు. కాగా, ఈఫిల్‌ టవర్‌ను రోజుకు 25 వేల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.