కశ్యప్ స్త్రీవాది.. అదే నిజమైతే సంబంధాలు తెంచేసుకుంటా: నటి తాప్సీ

23-09-2020 Wed 18:46
If Anurag Kashyap is found guilty I will be the first person to break all ties with him
  • అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు
  • ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయన్న తాప్సీ
  • ‘మీటూ’ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించొద్దని హితవు

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ ఐదేళ్ల క్రితం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక దాడికి పాల్పడ్డాడని నటి పాయల్ ఘోష్ ఇటీవల ఆరోపించింది. అతడిని శిక్షించాలని డిమాండ్ చేసింది. అనురాగ్‌పై వస్తున్న ఆరోపణలపై నటి తాప్సీ స్పందించింది. కశ్యప్ అలాంటివాడు కాదని, నిజానికి అతడు పెద్ద స్త్రీవాది అంటూ అండగా నిలిచింది. అతడిపై వస్తున్న ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్న తాప్సీ.. అవే కనుక నిజమైతే అతడితో అన్ని సంబంధాలు తెంపుకున్న తొలి వ్యక్తిని తానే అవుతానని స్పష్టం చేసింది.

లైంగిక దాడులపై ఎవరికి వారే తీర్పు ఇవ్వడం సరికాదని తాప్సీ హితవు పలికింది. నిజంగానే ఎవరిపైన అయినా లైంగిక హింస జరిగినట్టయితే నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయని పేర్కొంది. అప్పటికీ న్యాయం జరగకపోతే ‘మీటూ’ ఉద్యమం ఎలానూ ఉండనే ఉందని, ఇది అర్థవంతంగా కొనసాగుతోందని తాప్సీ పేర్కొంది. సంవత్సరాల అణచివేత తర్వాత మహిళలకు దొరికిన చక్కటి అవకాశం ‘మీటూ’ అని వివరించింది. దీనిని కూడా తప్పుదారి పట్టిస్తే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని తాప్సీ ప్రశ్నించింది.